నాడు ప్రజాస్వామ్య పరిహాసం... నేడు ప్రజాపాలన దరహాసం

నాడు ప్రజాస్వామ్య పరిహాసం... నేడు ప్రజాపాలన దరహాసం

 అధికారంలో ఉన్నపుడు ప్రజా నిరసనలను అణచివేసి,  భయభ్రాంతులను  సృష్టించి  తమ  పాలనను  శాశ్వతం  చేసుకుందామనుకున్న బీఆర్​ఎస్​.. ఇవాళ ప్రతిపక్షంగా ‘లగచర్ల’లో సృష్టించిన  అరాచక రాజకీయాన్ని తెలంగాణ చూసింది.     ప్రజాస్వామ్యంలో  నిరసన  తెలపడం  ప్రజల హక్కు అనే విషయం బీఆర్​ఎస్​ ఏనాడూ గౌరవించిన దాఖలా లేదు. కానీ, ఆ పార్టీ లగచర్లలో మాత్రం అరాచకానికి ఎగబడడాన్ని ప్రజలు చూశారు.  

పదేండ్లు,  నిరసనలు తెలిపే స్వేచ్ఛను  హరించిన విషయాన్ని ప్రజలు మర్చిపోలేదు. వ్యవస్థలు అన్నీ అంతిమంగా పౌరుడికి స్వేచ్ఛాయుత జీవనాన్ని ప్రశాంత వాతావరణంలో అందించేందుకే  పనిచేయాలి.  కానీ,  గత దశాబ్ద తెలంగాణ పరిపాలనలో ప్రజలు కోల్పోయింది అదే అనేది సత్యం.  నాటి నిర్బంధాల్లో తామేం కోల్పోయామో  నేటి  ప్రజాపాలనతో  స్వేచ్ఛాయుత  ఆత్మగౌరవం  ఎంత  విలువైనదో  అవగతమౌతుంది.  దశాబ్దాలుగా  హక్కుల సాధన కోసం చేసే  నిరసనల కార్యక్షేత్రంగా  పరిఢవిల్లిన ఇందిరా పార్క్ ధర్నా చౌక్  ఎత్తివేతే నాటి నిర్బంధాలకు నిలువెత్తు సాక్ష్యం.    

2016లో  అధికారంలోకి వచ్చిన  కొద్ది రోజులకే  విద్యుత్ టారిఫ్​ పెంచినప్పుడు నాటి ప్రతిపక్ష పార్టీలు,  ప్రజలు కలిసి చేసిన నిరసనలను ఉక్కుపాదంతో  అణచివేయాలని ప్రయత్నాలు చేశారు.   ఇష్టారీతిన  కమీషన్లు దండుకునేలా ప్రాజెక్టులు 
రూపొందించుకొని  అన్యాయంగా  ప్రజల భూముల్ని కొల్లగొట్టి  నిర్వాసితులుగా చేస్తే  మల్లన్న సాగర్ ప్రజలు చేసిన నిరసనలను అదేరీతిలో అణచివేశారు.  చివరికి ఇసుక దొంగల లారీల కిందపడి మా దళిత బిడ్డలు మరణిస్తున్నారని  నేరెళ్లలో  ధర్నాలు చేస్తే  తీవ్రవాది కన్నా  హీనంగా  థర్డ్ డిగ్రీ  ప్రయోగించి  హింసించారు.  ఇపుడు లగచర్లలో  పైశాచికానందం అనుభవిస్తున్నారు.

రైతన్నలకు బేడీలు వేసిన బీఆర్ఎస్​

ఖమ్మంలో  విత్తనాలు,  పురుగుమందులు కావాలని  ప్రశ్నించిన  రైతన్నలను  ఏకంగా  బేడీలు వేసి బంధించారు. పోరాటానికి ఊపిరులూదిన ఉస్మానియా యూనివర్శిటీపై  అప్రకటిత కర్ఫ్యూని  కొనసాగించారు. ఉద్యోగాలు  కావాలని  నినందించిన అశోక్ నగర్  నిరుద్యోగులపై  విచ్చలవిడిగా లాఠీలు ఝుళిపించారు.  ఇలా  చెప్పుకుంటూపోతే   తెలంగాణ రాష్ట్రంలో  బీఆర్ఎస్  ప్రభుత్వం  విధించిన సంకెళ్లు,  నిరసనలపై  మోపిన ఉక్కుపాదాలు  అడుగడుగునా కనిపిస్తూనే ఉంటాయి.  

గత ప్రభుత్వ మంత్రి ఎక్కడ ఎందుకు తిరిగినా అక్కడి కాంగ్రెస్ నేతల  గృహ నిర్బంధాలు, అక్రమ  బైండోవర్లకు లెక్కేలేదు.  ఇవన్నీ నాడు ప్రజాస్వామ్య పరిహాసానికి  బీఆర్ఎస్  సర్కార్ చేసిన చర్యలు.  చివరకు తెలంగాణ ఏర్పాటులో  కీలక పాత్ర  పోషించిన జేఏసీ  చైర్మన్  కోదండరాంను  ఇంటి  తలుపులు బద్దలుకొట్టి  మరీ అరెస్ట్  చేశారు.  ఏ  నిరసన  తెలపాలన్నా కోర్టుల అనుమతి ఉంటే తప్ప చేయలేని  దౌర్భాగ్య స్థితిని  కల్పించారు.  

పాలకుల్లో   రాజరిక పోకడలు ఉంటే  ఎలాంటి  వికృత పరిణామాలు ఎదురౌతాయో  తెలిపే గతం ఇదంతా... వీటన్నింటికి  పరాకాష్టగా  ప్రభుత్వం దృష్టికి తమ సమస్యను తీసుకెళ్లాలని ప్రతి చిన్న సంస్థ మొదలు  ప్రతిపక్ష పార్టీల వరకూ నిరసన  తెలిపే వేదికగా ఉన్న రాజదాని నడిబొడ్డున ఉన్న ఇందిరాపార్క్  ధర్నా చౌక్ ను సైతం ఎత్తేశారు.

ప్రజా సమస్యలను పరిష్కరిస్తున్న రేవంత్ సర్కారు

ఇవాళ ప్రతిపక్షంలోకి వచ్చాక తత్త్వం బోధపడి అదే ధర్నాచౌక్ వారికి దిక్కయింది.  చివరికి అక్కడ సైతం సొంతంగా నిరసన కార్యక్రమాలు చేయలేక ఇతరుల ధర్నాల్లోకి చేరి దాన్ని తమ ఖాతాలో వేసుకునే ప్రయత్నాలు చేస్తుంది. మొన్నటికి మొన్న ఆటో డ్రైవర్ల దర్నాకు వెళ్లిన  కేటీఆర్ ని  ‘నాడు ఈ ధర్నాలు చేసే అవకాశం లేకుండా ధర్నాచౌక్ మూసేసింది మీరే కదా’ అని వారు ప్రశ్నించారు. దయచేసి  మా సమస్యను ప్రభుత్వానికి నివేదించనివ్వండి, రాజకీయం చేసి జటిలం చేయకండి అని అన్నది అందరం విన్నాం.  రాష్ట్రంలో  ఎక్కడైనా  ప్రజాప్రభుత్వం  ప్రతిపక్షాలను అడ్డుకోలేదు. కనీసం ఆ  ప్రయత్నాలు కూడా చేయలేదు. అదీ ప్రజా ప్రభుత్వానికి ప్రజా సమస్యల పట్ల ఉన్న చిత్తశుద్దికి నిదర్శనం. 

హామీలు అమలు జరుగుతున్నాయి

 మొన్నటికి మొన్న సైతం గ్రూప్ 1కు, డీఎస్సీకు  వ్యవధి  తక్కువ  ఉంది  గ్రూప్2  పరీక్షను వాయిదా వేయమని అభ్యర్థులు కోరిన వెంటనే సమస్యలో ఉన్న హేతుబద్ధతను అర్థం చేసుకొని వారి కోరికను మన్నించి  పరీక్షను వాయిదా వేసి తమకు ఎలాంటి బేషజాలు లేవని చాటింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం.  రెండు లక్షల రుణమాఫీలో సైతం టెక్నికల్  ఎర్రర్ సమస్యను పరిష్కరించడానికి నిర్దిష్ట  కార్యాచరణ చేసింది.  

అధికారంలోకి వచ్చిన తక్షణమే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, పదిలక్షల ఆరోగ్య బీమా, 200 యూనిట్ల ఉచిత కరెంటు, ఇందిరమ్మ ఇల్లు, 50వేలకు పైగా ఉద్యోగ నియామకాలు, అన్నింటికీ మించి 2లక్షల ఏకకాలంలో రుణమాఫీ ఇలా ఇచ్చిన  ప్రతి  హామీని అమలుచేశారు. ఇవ్వని ఫోర్త్ సిటీని,  మూసీ  పునరుజ్జీవాన్ని  సంకల్పించారు.  

స్వార్థ  ప్రయోజనాల కోసం బీఆర్ఎస్​ పోరాటం

ఐదుకోట్ల మంది  తెలంగాణ  ప్రజానీకం,  సువిశాలమైన  ప్రాంతంలో  ప్రభుత్వం దృష్టికిరాని సమస్యలు సైతం ఉంటాయి. ఎన్నో అభివృద్ధి అంశాలు ఉంటాయి.  ఇలాంటివాటిని  ప్రతిపక్షం  బాధ్యతగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలి.  వాటి పరిష్కారానికి సలహాలు అందించాలి. కానీ ప్రజలను రెచ్చగొట్టే పనులతో ‘లగచర్ల’ సంఘటనలను మాత్రమే అది సృష్టిస్తున్నది.  

సాక్షాత్తు  ముఖ్యమంత్రే  ప్రతిపక్ష నేత  సహా  పౌరసమాజాన్ని విలువైన  సలహాలను,  సూచనలను  అందించమని  పదేపదే  కోరుతున్నా  ఫాంహౌస్ లో  పడుకొన్నవారెవరో యావత్ తెలంగాణకు  తెలుసు.  గోబెల్స్​లా  మారి   మహిళా  మంత్రులు అని కూడా   చూడకుండా  అవమానకరంగా   ప్రవర్తించిన  బీఆర్ఎస్  సోషల్  మీడియాను  కట్టడి చేయాలని  బాధ్యతాయుత  ప్రతిపక్ష నేత భావించకపోవడం దారుణం. 

రంధ్రాణ్వేషణల్లో విపక్షం

ప్రజాప్రభుత్వం  కొలువుదీరకముందే  ఈ  ప్రభుత్వాన్ని కూలుస్తామని  మాట్లాడినా  సైతం  రేవంత్ రెడ్డి ఉదాసీనంగానే  వ్యవహరించారు.  ప్రతి  మంచి పనిలోనూ  రంధ్రాన్వేషణ  చేస్తున్నా  పట్టించుకోవట్లేదు.  చివరికి బీఆర్ఎస్  ఎమ్మెల్యేలు,  ఇతర నేతలు  స్వార్థ రాజకీయాల కోసమే మాట్లాడుతున్నారు.

 ప్రజల  గురించి  ఇప్పుడైనా ఆలోచించండి అని వారికి బుద్ధి చెప్తున్నారు తప్పితే అరెస్టులు చేసి బంధించడం లేదు.  ధర్నాచౌక్  తెరిపించడం సహా  ప్రజా నిరసనలను  వినమ్రంగా  స్వీకరిస్తున్నారు. ఇంతకుమించిన అర్థం ప్రజాపాలనకు ఉండదు. ఈ విషయాన్ని ప్రతిపక్షం అర్థం చేసుకోవాలి.  దేశంలో అగ్రగామిగా  తెలంగాణను  తీసుకెళ్లే పనిలో  ప్రభుత్వానికి అండగా ఉండాలి.  అదే వారికి ప్రజలు అప్పజెప్పిన కర్తవ్యం.

- బోదనపల్లి వేణుగోపాల్ రెడ్డి, సీఈవో, టిశాట్ నెట్​వర్క్–